సీఎం కెసిఆర్ కు ఎంపీ బండి సంజయ్ లేఖ..
ఆసరా పెన్షన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు..టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ఏమైంది? అంటూ రాష్ట్ర బిజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదని అన్నారు. తెలంగాణలో దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారికి వెంటనే పెన్షన్లను మంజూరు చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ ముఖ్యమంత్రిని కోరారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటనలే తప్ప అందుకు తగ్గ కసరత్తు లేకపోవడం శోచనీయమని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి ఒకే ఆసరా పెన్షన్ అని నిర్ణయించడం అన్యాయమని, అర్హతల వారందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల దాదాపు 2 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ లేకుండా పోయిందన్నారు.
