Breaking News

మరోసారి కొత్త రక్షణ సహకార ఒప్పందం..

 


కొత్త రక్షణ సహకార ఒప్పందంపై భారత, బ్రిటన్‌ ప్రధానులు నరేంద్ర మోడీ, బోరిస్‌ జాన్సన్‌లు సంతకాలు చేశారు. రక్షణ, వాణిజ్యం, క్లీన్‌ ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో చర్చలు జరిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు మోడీ, బోరిస్‌ జాన్సన్లు ఢిల్లీలో భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో మంచి పురోగతి సాధించినట్లు ప్రధాని మోడీ అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఒప్పందాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇది భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య స్వేచ్ఛా ఒప్పందంలా ఉండనుందని అన్నారు. భారత్‌ సొంతంగా యుద్ధ విమానాలను తయారీ చేసేందుకు బ్రిటన్‌ కూడా సాయం చేస్తుందని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు.


అన్ని దేశాల ప్రాదేశికతను, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిన మోడీ.. ఇండో-పసిఫిక్‌ ఒప్పందంలో ఉచిత, బహిరంగ, సంఘటిత, నియమాల ఆధారిత ఆర్డర్‌పై ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. శాంతియుత, స్థిరమైన, సురక్షితమైన ఆఫ్గాన్‌కు తాము మద్దతునిస్తామని పునరుద్ఘాటించారు. ఇతర దేశాలలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఆప్ఘన్‌ భూభాగాన్ని ఉపయోగించకూడదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ఉగ్రదాడిపై స్పందించిన ఆయన.. సంభాషించాలని, కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిచ్చారు.

భారత్‌ టీకా భేష్‌

కాగా, ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను బోరిస్‌ జాన్సన్‌ ప్రశంసించారు. తాను భారత్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ తీసుకున్నానన్నారు. దాని వల్లే తానిప్పుడు సురక్షితంగా ఉన్నానని పేర్కొంటూ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు