ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయం.ఇక పై బస్సుల్లో ఫోన్ పే , గూగుల్ పే ...
ఆర్టీసీ బస్సుల్లో చిల్లర పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. బస్సు ఎక్కే చాలా మంది ప్రయాణికులు.. పెద్ద నోట్లు ఇవ్వడం, వారందరికీ చిల్లర సర్దుబాటు చేయడం కండక్టర్లకు తలనొప్పిగా మారుతుంది. ఒక్కోసారి ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య చిల్లర కోసం ఘర్షణలు కూడా జరుగుతాయి. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చిల్లర కోసం వెతకాల్సిన అవసరం లేకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది.
బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ. పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల పరిధిలో నడిచే సర్వీసుల్లో నగదు రహిత డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల దగ్గరున్న టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల స్థానంలో, ఈ–పోస్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రాలతో ప్రయాణికులు నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డెబిట్/క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి, లేకుంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో డబ్బు చెల్లించి టిక్కెట్లు పొందొచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే బస్సుల్లో ఇకపై చిల్లర సమస్య ఉండదు.
