ఆగస్టులోగా రాష్ట్రంలోని అర్హులకు కొత్తగా ఆసరా పింఛన్లు..
జూలై ఆఖరి నుంచి ఆగస్టులోగా రాష్ట్రంలోని అర్హులకు కొత్తగా ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులను గడపగడపకూ వెళ్లి అందిస్తామని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎన్ని సమస్యలు ఉత్పన్నమైనా10 వేల కోట్ల రూపాయలను పింఛన్లరూపంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో గోపల్‌దిన్నె, సింగోటం లింక్ కెనాల్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం శానాయిపల్లిలో మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఆయన రెండు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడారు.
ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రాధేయపడుతున్నారని, 65 ఏళ్లు అవకాశం కల్పిస్తే అభివృద్ధిని విస్మరించిన ఆ పార్టీ కాలం చెల్లిన మందులాంటిదని అన్నారు. దేశంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ లాంటి దౌర్భాగ్య పార్టీల అవసరం ఇక్కడ లేదన్నారు. ఈడీ కేసుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులుగా విచారణ పేరుతో తిప్పుకుంటుంటే ఆ పార్టీ నేతలు, యంత్రాంగం చేష్టలుడిగి దిక్కులు చూస్తోందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పాలన తిరిగి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని, పాడె మీద పీనుగ లాగా ఆ పార్టీ పరిస్థితి ఉందన్నారు. కుల పిచ్చి, మత పిచ్చి కలిగి ఉన్న పార్టీలు మనకొద్దని, అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే అభిమతంగా ముందుకుపోతున్న టీఆర్‌ఎ్‌సను ప్రజలు ఆదరించాలని కోరారు.
