డోలో 650... రోజుకో నిజం..!!
కరోనా పుణ్యామా అని ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన ట్యాబ్లెట్ పేరు డోలో 650. కొవిడ్ వచ్చిన దగ్గర నుంచి దీనికి ఒక్కసారిగా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రతి మనిషి కనీసం ఒక్కసారి అయినా దీనిని ఉపయోగించే ఉండి ఉంటారు. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ పేరు మాత్రమే కాదు.దాని కంపెనీ పేరు కూడా కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ట్యాబ్లెట్లను మైక్రో ల్యాబ్స్ కంపెనీ వీటిని తయారు చేస్తోంది. అయితే ఈ కంపెనీపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ గట్టిగా నిఘాపెట్టింది. సోదాలు నిర్వహించింది. తాజాగా ఈ కంపెనీపై సెంట్రల్ బోర్టు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మైక్రో ల్యాబ్స్ కంపెనీలో డోలో 650 ట్యాబ్లెట్లను ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడానికి డాక్టర్లు, ఇతర మెడికల్ సిబ్బందికి దాదాపు రూ.1000 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చిందని సీబీడీటీ ఆరోపించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రో ల్యాబ్స్ కంపెనీపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జులై 6న ఏకకాలంలో 9 రాష్ట్రాల్లోని 36 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీడీటీ ఈ మేరకు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాదాపు రూ. 1.2 కోట్ల విలువైన క్యాష్‌ను జప్తు చేశామని వెల్లడించింది. అలాగే రూ. 1.4 కోట్ల విలువైన బంగారం, డైమండ్ నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. సోదాలు చేసే సమయంలో నేరారోపణకు బలాన్ని చేకూర్చే కీలకమైన పత్రాలు, డిజిటల్ డేటా లభించిందని సీబీడీటీ పేర్కొంది. ప్రొడక్ట్ సేల్స్‌ను ప్రోత్సహించడానికి కంపెనీ తప్పుడుమార్గాలను ఎంచుకుందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. డాక్టర్లకు, ఇతర మెడికల్ సిబ్బందికి బహుమతులు అందించిందని, ఈ ఉచితాల మొత్తం రూ. 1000 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కాగా సీబీడీటీ తన స్టేట్‌మెంట్‌లో ఈ కంపెనీ పేరును నేరుగా ప్రస్థావించలేదు. గ్రూప్ అని పేర్కొంటూ వచ్చింది. అయితే అందరూ దీన్ని మైక్రో ల్యాబ్స్‌గా పేర్కొంటున్నారు. కాగా డోలో 650 అమ్మకాలు గత కొన్నేళ్లుగా బాగా పెరుగుతూ వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం చూస్తే.. 2020లో డోలో 650 అమ్మకాల విలువ ఏకంగా రూ. 350 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత ఈ విలువ రూ. 400 కోట్లకు పైగా చేరింది. కాగా ఈ కంపెనీ రూ. 300 కోట్ల పన్ను ఎగవేతకు కూడా పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా సీబీడీటీ ఆరోపణల అంశంపై కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు.
