రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆయిల్ పామ్ సాగుపై ప్రభావం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆయిల్ పామ్ సాగుపై ప్రభావం చూపనున్నాయి. సబ్సిడీ ఎత్తివేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులతో జరిపిన రివ్యూలో సీఎస్ కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సాగుకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుంచి రైతులకు రుణం ఇప్పించాలని, దీని ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సూచించినట్లు సమాచారం. దీని కోసం పైలట్ ప్రాజెక్టుగా వంద అప్లికేషన్లను పరిశీలించి, బ్యాంకులతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే.. రాయితీ నగదును రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చర్చించినట్లు సమాచారం. అయితే అధికారుల నిర్ణయాలు ఇంకా ముఖ్యమంత్రి దాకా చేరలేదని, సీఎం వరకు వెళ్లాక ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ జరుగుతోంది. ఎనిమిదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సబ్సిడీ ఎత్తివేసి, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి సాగు చేయిస్తే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని ఔత్సాహిక రైతులు చెబుతున్నారు. రైతులపై కూడా తీవ్ర భారం పడుతుందని పేర్కొంటున్నారు. రూ. 3 లక్షల వరకు రుణం! మొదట వంద దరఖాస్తులను పరిశీలించి అధికారులు పైలట్ ప్రాజెక్టు గా తీసుకోనున్నారు. డీసీసీబీ, పీఏసీఎస్ ల ద్వారా వీరికి రూ.55 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఇప్పించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట మినహా పెద్దగా ఎక్కడా ఆయిల్ పామ్ సాగు కావడంలేదు. రుణాలపై ఆయిల్ పామ్ ను సాగుచేయించాలని భావిస్తుండడంతో డ్రిప్ కంపెనీలు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైతులే స్వయంగా వెళ్లి కంపెనీలతో మాట్లాడుకుంటే తప్ప డ్రిప్ అమర్చే పరిస్థితులు లేవు. భారంగా డ్రిప్, మొక్కలు సబ్సిడీ ఎత్తివేస్తే మొక్కలు, డ్రిప్ భారాన్ని రైతులే భరించాల్సి ఉంటుంది. ఎకరంలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి డ్రిప్ అమర్చాలంటే రూ. 21 వేల వరకు ఖర్చవుతుంది. అంతే కాకుండా 57 మొక్కలు అవసరమవుతాయి. సబ్సిడీతో ఒక్కో మొక్క రూ.197 పడుతుండగా, సబ్సిడీ లేక ప్రభుత్వమే మొక్కలు అందిస్తే రూ.250వరకు ధర పడుతుంది. దీంతో ఎకరానికి రైతుకు రూ.32వేలకు పైగా ఖర్చు వస్తుంది. దీనికి ఎరువులు, కూలీల ఖర్చు అదనం. ప్రభుత్వం మొక్కలు అందించకుంటే వాటిని ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటుగా ప్రస్తుతం ఒక్కో మొక్క రూ. 500 నుంచి రూ. 600 వరకు ధర పలుకుతోంది. దీంతో రైతుకు రూ. 55 వేల వరకు ఖర్చవుతుంది. ఎరువులు, కూలీల ఖర్చు అదనం. రుణం రైతుకు గుదిబండే.. రుణం తీసుకొని ఆయిల్ పామ్ సాగు చేయడం రైతులకు గుదిబండ మారనుంది. ఆయిల్ పామ్ దిగుబడి ఐదో ఏట నుంచి ప్రారంభమవుతుంది. అప్పటి వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుకు వడ్డీ పెరుగుతూ పోతుంది. క్రాప్ లోన్లకు ఇస్తున్న వడ్డీకే ఆయిల్ పామ్ సాగుకు కూడా అప్పు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీని ప్రకారం లోన్ ఇచ్చినా 4ఏళ్లకు వడ్డీ, అసలు కలిపి రైతుకు తీవ్ర భారం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అధికశాతం భూములు తనఖా కింద బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు డబుల్ లోన్ ఇస్తాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఇంకెలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సరీల్లోనే రూ.600కోట్ల మొక్కలు ఈ ఏడాది 2లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని నిర్ణయించారు. అయితే ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, నూతన నిర్ణయాలు సాగుకు ఆటంకంగా మారాయి. ప్రస్తుతం 2 లక్షల ఎకరాలకు అవసరమయ్యే మొక్కలు నర్సరీల్లోనే ఉన్నాయి. వీటి పెంపకానికి సుమారు రూ.600 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర సబ్సిడీ రూ.360కోట్లుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.240కోట్లు భరించింది. సాగు ఆలస్యం అవుతుండడంతో ఈ మొక్కలు నర్సరీల్లోనే ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ మొక్కలు సాగయితేనే, వచ్చే ఏడాదికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీలు అందుబాటులో ఉంటాయి. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి భారమా? ఆయిల్ పామ్ సాగుకు ఇస్తున్న సబ్సిడీలతో ప్రభుత్వానికి ఆర్థిక భారం కలుగుతుందని భావించిన ప్రధాన కార్యదర్శి ఈ నిర్ణయాలను చేసినట్టు తెలుస్తోంది. అయితే సాగుకు కేంద్రం కూడా సబ్సిడీని ఇస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు నెల వారీగా విభజించి ఉద్యానవన, ఆయిల్ ఫెడ్ శాఖలకు అందిస్తే పెద్దగా భారం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ అధికారులు దానిపై దృష్టి సారించకుండా, ఏకంగా సబ్సిడీనే ఎత్తేయాలని నిర్ణయిస్తే, ఆయిల్ పామ్ సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరిన్ని ప్రోత్సాహకాలు అందించే బదులు, ఉన్న సబ్సిడీని ఎత్తివేస్తే రైతులు ఎలా ముందుకు వస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
