తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు కేసీఆర్ సర్కార్ శుభవార్తను చెప్పింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు సకాలంలో చేయించుకోని వాహనదారులకు రోజుకు రూ.50 చొప్పున విధించే అదనపు రుసుంను ( ఫిట్‌నెస్ ట్యాక్స్‌పై లెవీ) ప్రభుత్వం రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అన్ని రకాల వాహనాలకు ఎప్పుడూ లెవీ విధించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా కరోనా టైంలో 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య కాలంలో ఫిట్నెస్ చేయించుకోని వాహనదారులపై రోజుకు రూ.50 చొప్పున విధించిన ఆలస్య రుసుంను సైతం మినహాయిస్తున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి కే శ్రీనివాస రాజు తెలిపారు. కే శ్రీనివాస రాజు మాట్లాడుతూ.."వాహనదారులకు..ప్రధానంగా ఆటోలు, ఇతర రవాణా వాహనదారులకు భారీ ఊరటనిస్తూ, కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిట్‌నెస్ ట్యాక్స్‌పై విధించే లెవీని రద్దు చేశారు. సామాన్యంగా ఫిట్‌నెస్‌లు సకాలంలో చేయించుకోనివారికి రోజుకు రూ.50 అదనంగా విధిస్తారు. ఇప్పుడు దానిని కేసీఆర్ పూర్తిగా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల 20వేల మంది వాహనదారులకు ఊరట లభించింది. రోజుకు రూ.50 అదనపు రుసుం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.640 కోట్ల ఆదాయం తగ్గింది. ఆర్థికంగా సతమతం అవుతున్న ఆటోడ్రైవర్లు, యజమానులకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా లక్షకుపైగా ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది" అని ఆయన అన్నారు. ఇక, ఫిట్‌నెస్‌ల విషయంలో లేవీ ఇబ్బందులు ఉండవని, కేవలం ఫిట్నెస్ రుసుం మాత్రమే చెల్లించి ఫిట్నెస్ సర్టిఫికెట్లను వాహనదారులు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. అంటే సకాలంలో ఫిటెనెస్ చేయించుకోని వారు ఇప్పుడు ఎలాంటి లెవీ ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారమే ఫిట్‌నెస్ రిన్వాల్ చేయించుకోవచ్చన్నమాట.
