ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్..
గోదావరి (Godavari) నదిలో ప్రతిఏటా ఉదృతంగా ప్రవహించే భారీ వరదల నుంచి పరివాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పేర్కోన్నారు. గోదావరి నది వరద పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసిఆర్ అధికార యంత్రాంగంతో కలిసి హన్మకొండ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోదావరి నది, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్ని సార్లు, ఎన్నిలక్షల క్యూసెక్కుల ప్రవాహం, ఎప్పడెప్పుడు వచ్చిందని ఇరిగేషన్ అధికారులను ఆరా తీశారు. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న కరకట్టలు వాటి నాణ్యత తదితర వివరాల గురించి అధికారులతో చర్చించారు. కడెం ప్రాజెక్టు వరద సామర్ద్యం 2.95 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడెం ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని సీఎం పేర్కోన్నారు. భవిష్యత్తులో గోదావరి నదీ తీరంలో వరద వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్రమైన సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇంతకు ముందు ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన అనుభజ్ఞులైన ఇంజనీర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని సీఎం సూచించారు. గోదావరి లోతట్టు ప్రాంతలు ముంపునకు గురై ఇబ్బంది పడుతున్న ప్రజలకు అన్నిరకాల సహాయ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు కోటి రుపాయల చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆర్థిక మంత్రి హరీష్ రావును ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మందులు, ఆహారం, అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రిని ఆదేశించారు. ఇంకా కొన్నిరోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా వుండాలని సీఎం సూచించారు. ఈరోజు (ఆదివారం) ఏరియల్ సర్వే అనంతరం ఏటూరు నాగారంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
