ప్రమాదంలో ప్రాజెక్టులు.. టెన్షన్‌లో ఇరిగేషన్ శాఖ!
నీటిపారుదలశాఖలో కీలకమైన మెకానికల్ విభాగాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. ప్రతి ఏటా ప్రాజెక్టుల గేట్ల ఓవర్ హాలింగ్, గ్రీజింగ్ పనులు చేపట్టి వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచే ఈ శాఖ ఉనికిలో లేకుండా పోయింది. దీంతో దశాబ్దాలుగా గేట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. కడెం జలాశయానికి ఓ వైపు ఎగువ నుంచి భా
రీగా వరద.. గేట్లు సరిగా ఓపెన్ కాకపోవడం.. 18వ గేటు బిగుసుకుపోవడంతో అధికారులు టెన్షన్ పడ్డారు. ఎడమ కాల్వకు గండిపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కడెం జలాశయానికి గండి పడి ఉంటే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగేవి. ఇదిలా ఉండగా ఎస్సారెస్పీ గేట్లు సైతం మొరాయించాయి. లోయర్ మానేరు డ్యాంకు సంబంధించి నాలుగైదు గేట్లు బిగుసుకుపోయాయి. దీంతో అధికారులు మరమ్మతులను ప్రారంభించారు. ఎగువ నుంచి తక్కువ మొత్తంలో నీటిని వదులుతుండటం గమనార్హం. దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్న ప్రభుత్వం వాటి వాటి మెయింటెనెన్స్‌ను గాలికొదిలింది. ఎన్నో ఏండుగా గేట్ల గ్రీజింగ్‌కు కూడా పైసా విదిల్చడం లేదు. కాలువల మరమ్మతుపై నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతుండటంతో వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రాజెక్టుల మెయింటనెన్స్ కు కేంద్రం కొంత ఫండ్స్ కేటాయిస్తున్నా.. వాటిని వినియోగించడం లేదు. ఇచ్చిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో నిధులు విడుదల కాలేదు. తాజాగా కడెం ప్రాజెక్టు గేట్లు మొరాయించాయి. ముందు నుంచీ గేట్లు సరిగా ఓపెన్ కాలేదు. 18వ గేట్ మొత్తానికే ఎత్తలేదు. ఎంత ప్రయత్నం చేసినా గేట్ ఓపెన్ కాకపోవడంతో.. అధికారులు వదిలేశారు. దీంతో ప్రాజెక్టు ఎడమ వైపు గండిపడింది. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ ప్రాజెక్టుల గేట్లు కూడా ఇప్పుడు సరిగా తెరుచుకోవడం లేదు. కడెం ప్రాజెక్టు సమస్య ఉత్పన్నమైన నేపథ్యంలో.. అధికారులు జలాశయాల గేట్ల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఎల్ఎండీలో కూడా మూణ్నాలుగు గేట్లు మొరాయిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే విడుదల చేయడం లేదు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నది. దాదాపు 4.50 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ, మిడ్ మానేరుకు నీటిని వదిలేందుకు అధికారులు జంకుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా గేట్ల సమస్యే. ఎందుకంటే ఇప్పటికే ఎల్ఎండీ గేట్లు మొరాయిస్తున్నాయి. అటు మిడ్ మానేరుది కూడా అదే పరిస్థితి. ఎస్సారెస్పీ నుంచి నదిలోకి వదిలే నీటిలో కొన్ని క్యూసెక్కులు ఇటు వైపు మళ్లిస్తే మిడ్ మానేరు నుంచి గేట్లు ఎత్తి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. మిడ్ మానేరు దగ్గర కూడా గేట్ల పరిస్ధితి బాగా లేదని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిడ్ మానేరుకు బుధవారం ఉదయం వరకు 11వేల క్యూసెక్కులు వదిలినా.. మధ్యాహ్నం బంద్ చేశారు. ఈ ప్రాజెక్టు 27 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇప్పుడు 11 టీఎంసీలు మాత్రమే దాటింది. నిల్వకు అవకాశం ఉన్నా గేట్ల పరిస్థితిని విశ్లేషించుకొని ఆపేసినట్టు సమాచారం. ఎల్ఎండీకి కూడా నీటిని వదలడం లేదు. 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్ఎండీలో ఇప్పుడు 9 టీఎంసీల నీళ్లున్నాయి. ఇక్కడ కూడా గేట్లను పరిశీలిస్తే దాదాపు నాలుగైదు గేట్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడికి దఫదఫాలుగా స్వల్పంగా నీటిని వదులుతున్నారు. బుధవారం సాయంత్రం 3 వేల క్యూసెక్కులు ఎల్ఎండీకి చేరడం గమనార్హం. ప్రమాదంలో మూసీ మూసీ ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 2015 నుంచి ఇప్పటివరకు మెయింటెనెన్స్ కోసం పైసా నిధులు ఇవ్వకపోవడం, 35 మంది స్టాఫ్ కు గాను కేవలం నలుగురు మాత్రమే ఉండడంతో రిపేర్లు చేయలేక ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని ఇంజినీర్లు చెబుతున్నారు. మూసీ ప్రాజెక్టును12 క్రస్టు గేట్లు, 8 రెగ్యులేటరీ గేట్లు, 10 సిల్ట్‌గేట్లతో నిర్మించారు. దీని డిశ్చార్జ్ కెపాసిటీ 4లక్షల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 2లక్షల క్యూసెక్కులను సైతం విడవలేని పరిస్థితి ఉంది. కీలకమైన రెగ్యులేటరీ గేట్లు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని ఇంజినీర్లు చెబుతున్నారు. గత ఏడాది భారీ వరదలకు11 క్రస్ట్ గేట్లు ఎత్తిన ఆఫీసర్లు, 2 రెగ్యులేటరీ గేట్లను మాత్రమే తెరవగలిగారు. 1,3,4, 5, 6,8 నంబర్ గేట్లను ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయారు. కేవలం 2,7 నంబర్ రెగ్యులేటరీ గేట్లు మాత్రమే ఓపెన్ చేసినా వాటిని క్లోజ్ చేసేందుకు కూడా అష్టకష్టాలు పడ్డారు. వాటి బేస్ దెబ్బతింటున్నదని, బలవంతంగా క్లోజ్ చేసినా మళ్లీ తెరిచే పరిస్థితి ఉండకపోవచ్చని అధికారుల అనుమానం. ఈ ప్రాజెక్టులో ఇసుకమేట, బురదను తొలగించేందుకు ఏర్పాటు చేసిన సిల్ట్ గేట్లు కూడా గతంలో కొట్టుకుపోగా, సిమెంట్‌తో శాశ్వతంగా క్లోజ్ చేశారు. కనీసం అవి ఉన్నా ఇలాంటి టైంలో పనికి వచ్చేవని ఇంజినీర్లు అంటున్నారు. 2015 నుంచి మెయింటెనెన్స్‌కు పైసా కూడా విడుదల చేయలేదని ప్రాజెక్టు ఇంజినీర్లు అంటున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే : దొంతి లక్ష్మీనారాయణ, సాగునీటిరంగ నిపుణులు ప్రాజెక్టుల మెయింటనెన్స్ కు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. గేట్ల రిపేర్ కు నిధులు ఇవ్వకపోవడంతో పలు ప్రాజెక్టుల గేట్లు పనిచేయడం లేదు. కడెం ప్రాజెక్టులో 18గేట్లకు గాను 17 గేట్లే పనిచేస్తున్నాయి. ఆ గేటు కూడా పనిచేస్తే వరద ఉధృతి కొంచెం తక్కువగా ఉండేది. వర్షాకాలనికి ముందే అధికారులు ప్రీ మాన్సూన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దానిని అధికారులు పాటించడంలేదు, వాస్తవానికి కడెం ప్రాజెక్టు ఉప్పొంగితే మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగేవి. కడెం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ వద్ద గండి పడడంతో సేఫ్ అయ్యాం. ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో మెకానికల్ డిపార్ట్ మెంట్ ను తీసేసింది. వ్యవస్ధ లోపం వల్లే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి.
