Breaking News

కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత

 


కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు..  దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు.. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే ధర్నా నిర్వహించారు జనసేన కార్యకర్తలు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు.. కొడాలి నాని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు నేర్పడం మాని అధ్వానంగ ఉన్న గుడివాడ రోడ్లకు మరమ్మతులు చేయించాలని హితవు పలికారు. 

 ప్రతీసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావన తీసుకొస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ మధ్య జరిగిన వైసీపీ ప్లీనరీ వేదికగానూ పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్లు చేశారు కొడాలి నాని.. ఇలా ప్రతీసారి ఏ విషయంలోనైనా వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది జనసేన పార్టీ.. #GoodMorningCMSir హాష్ ట్యాగ్‌తో.. ఏపీలోని రోడ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్‌ చేస్తున్నారు జనసేన పార్టీ శ్రేణులు.. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయాలంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. జనసేన నిర్వహిస్తోన్న డిటిటల్‌ క్యాంపెయిన్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తుంది.. ఇప్పటికే 226 వేల ట్వీట్లతో #GoodMorningCMSir హాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.