Breaking News

బాలీవుడ్ లో 100కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా..

 


దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలై నేటికి ఐదు రోజులైంది. మొదటి రోజు నుంచీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా హీరోలుగా స్ర్కీన్ షేర్ చేసుకొని .. అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. బాహుబలి తర్వాత జక్కన్న తన టేకింగ్ మాయాజాలాన్ని మరోసారి రుచిచూపించాడు. మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500కోట్లకు పైగానే వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు ను నెలకొల్పింది. అయితే ఈ సినిమాకి బాలీవుడ్ లో తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. హిందీ ప్రేక్షకులు మరోసారి యాక్షన్ కి, ఎమోషన్స్ కి పట్టంగట్టారు. తాజా బాక్సాఫీస్ రిపోర్ట్ లో ఈ సినిమా మొదటి సోమవారం కలెక్షన్స్ ను 2022 లో మునుపటి విడుదలలతో పోల్చితే చార్ట్ లో నెంబర్ వన్ గా నిలిచింది. 

‘కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ ఖతియావాడి, బచ్చన్ పాండే, బదాయి దో, రాధేశ్యామ్’ మొదటి సోమవారం వసూళ్ళను అధిగమిస్తూ.. ఏకంగా రూ. 17కోట్లు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సత్తా చాటుకుంది. దాదాపు 8000 స్ర్కీన్స్ లో భారీగా విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా వారం గడిచే కొద్దీ.. వసూళ్ళ పరంగా మరింత దూసుకుపోతోంది. వాస్తవానికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 91.5 కోట్లు దాటుతుందని అంచనా. కానీ ఐదురోజులకే ఈ మూవీ రూ. 100కోట్లు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో బాలీవుడ్ లో ఇంకే రేంజ్ లో వసూళ్ళు కొల్లగొడుతుందో చూడాలి.