ఏడాది చివరి నాటికి 4G బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు ప్రారంభం
బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఏడాది చివరి నాటికి 4G సేవలను ప్రారంభిస్తుందని, దీనితో టెలికాం కంపెనీ సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో తెలిపింది. రాజ్యసభ లో ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీ ప్రశ్నలకు సమాధానమిస్తూ కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ ఈ సమాచారం ఇచ్చారు. సంస్థ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. 2019 అక్టోబర్‌లో ప్రభుత్వం దీనికి సంబంధించి ప్యాకేజీని కూడా ప్రకటించిందని, ఆ తర్వాత కంపెనీలోని 70 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని చౌహాన్ చెప్పారు. చేపట్టిన పలు చర్యలను ప్రస్తావిస్తూ.. భూమిని సేకరించేందుకు, మార్కెట్ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చిందని తెలిపారు.
