Breaking News

పెరగనున్న టోల్‌ ట్యాక్స్‌...

 


ఇప్పటికే వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో సతమతమవుతున్న సగటు వాహనదారుడికి హైవేల్లో టోల్‌ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022-23)కి టోల్‌ ట్యాక్స్‌ను సవరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ప్లాజాల వారీగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. తేలికపాటి వాహనాల సింగిల్‌ జర్నీకి టోల్‌ కాంట్రాక్టర్‌ నిర్వహిస్తున్న రోడ్డు దూరం, సదుపాయాలను బట్టి.. రూ. 5 నుంచి రూ. 10 వరకు పెంచింది. డబుల్‌ ఎంట్రీకి కనిష్ఠంగా రూ. 10 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. తేలికపాటి గూడ్స్‌ వాహనాలు/మినీ బస్సులకు సింగిల్‌ ఎంట్రీకి కనిష్ఠంగా రూ. 15, బస్సులు/రెండు యాక్సిల్స్‌ ఉండే ట్రక్కులకు రూ. 25, ట్రిపుల్‌ యాక్సిల్‌ వాహనాలకు రూ. 30, నాలుగు నుంచి ఆరు యాక్సిల్స్‌ వాహనాలకు రూ. 45, ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్స్‌ ఉండే భారీ ట్రక్కులకు రూ.50 చొప్పున టోల్‌ చార్జీలు పెరిగాయి. ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

తెలంగాణ మీదుగా 10 జాతీయ రహదారులు వెళ్తుండగా.. వాటిపై 28 చోట్ల టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి టోల్‌ ఫీజులు పెరగనున్నాయి. నెలవారీ పాసుల ఫీజులు భారీగా పెరిగాయి. తేలికపాటి వాహనాల నెలవారీ ఫీజు కనిష్ఠంగా రూ. 295 మేర పెరిగింది. అయితే.. టోల్‌ప్లాజా ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్‌ నంబరు ప్రైవేటు తేలికపాటి వాహనాల ఫీజుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉన్న టోల్‌ఫీజులే అమలవుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.