పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు..
విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ ‘లైగర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. విజయ్ - పూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘జనగణమన’. మంగళవారం ముంబైలో ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. పూరి కనెక్ట్, శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి నిర్మాతలు. ఈ చిత్రాన్ని 2023 ఆగస్టు 3న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇదో యాక్షన్ ఎంటర్‌టైనర్. మంగళవారం విడుదల చేసిన విజయ్ ఫస్ట్‌లుక్‌ని చూస్తే.. ఇదో సైనికుడి పోరాటంలా, యుద్ధం నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘‘విజయ్‌తో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. బలమైన కథ, కథనాలు ఉన్న చిత్రమిది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా, ఉద్వేగ భరితంగా సాగుతుంద’’న్నారు. ‘‘పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకొన్నందుకు గర్వంగా ఉంది. ప్రతీ భారతీయుడి హృదయాన్ని సృశించే కథ ఇది. చాలా గొప్పగా వచ్చింద’’న్నారు విజయ్. ప్రతి ఒక్కరినీ తట్టిలేపే కథ ఇదని వంశీ పైడిపల్లి చెప్పారు.
