ఆర్.ఆర్.ఆర్ సినిమా పై ఎన్టీఆర్ భావోద్వేగమైన లేఖ .
‘‘ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి మద్దతు తెలిపిన అభిమానులకు, ఇతర చిత్రపరిశ్రమల వారికీ ధన్యవాదాలు. మనమంతా ఒకటిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇలా ఉంటేనే.. భారతదేశం నంబర్ వన్ అవుతుంద’’న్నారు ఎన్టీఆర్. ఇటీవల ఆయన రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఓ భావోద్వేగమైన లేఖని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉందని, ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, మద్దతు తెలిపిన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా చరణ్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చరణ్ అల్లూరి పాత్రని అద్భుతంగా పోషించాడని, ఆ పాత్రలో చరణ్‌ని తప్ప మరెవ్వరినీ ఊహించలేమని, చరణ్ లేకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమానే లేదని కొనియాడాడు. చరణ్ వల్లే.. కొమరం భీమ్ పాత్రని తాను అంత సమర్థవంతంగా పోషించే వీలు చిక్కిందని ప్రశంసించారు. ‘‘నాలోని నటుడ్ని పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చేలా స్ఫూర్తినింపిన జక్కన్నకు కృతజ్ఞతలు’’ అని ఆ లేఖలో రాసుకొచ్చారు. సంగీత దర్శకుడు కీరవాణితో పాటుగా ఈ చిత్రానికి పనిచేసిన సెంథిల్, కార్తికేయ, కాల భైరవ, సాబు సిరిల్ తదితరుల పనితీరుని, వాళ్ల కష్టాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు ఎన్టీఆర్.
