దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ ముద్ర..
దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇక ప్రత్యేక ఆయుష్ ముద్ర వేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
దీంతో భారత్‌లో తయారైన ఈ ఔషధాల నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో గట్టి నమ్మకం ఏర్పడనుందని అన్నారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా చివరి రోజైన బుధవారం గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్టెమెంట్, ఇన్నోవేషన్ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుష్ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు త్వరలో ప్రత్యేక ఆయుష్ వీసాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో సంప్రదాయ వైద్యంలో చికిత్స పొందేందుకు వచ్చే విదేశీ పర్యాటకులకు మేలు జరుగుతుందని అన్నారు. పర్యాటక రంగంలోనూ సంప్రదాయ వైద్యానిది కీలక పాత్రగా పేర్కొన్న ప్రధాని.. పర్యాటకంగా కేరళ అభివృధ్ది చెందిందంటే కారణం.. అక్కడి ప్రాచీన చికిత్సా విధానాలేనని తెలిపారు. కేరళ తరహాలో భారత్‌లోని ప్రతి ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించే శక్తి ఉందన్నారు. 2022లో భారత్‌కు చెందిన 14 అంకుర సంస్థలు యూనికార్న్ స్థాయి సాధించాయని చెప్పిన మోదీ ఆయుర్వేదంలోనూ ఓ యూనికార్న్ రావాలని ఆకాంక్షించారు.
